గ‌త ఐదేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ప్రధాన్ మంత్రి ఉచ్ఛతర్ శిక్ష ప్రోత్సాహన్ (PM-USP) యోజన పథ‌కం కింద రూ.215 కోట్లు నిధులు విడుద‌ల చేయ‌టం జ‌రిగింది. ఇందులో విద్యా రుణాల కోసం కేంద్ర రంగ వ‌డ్డీ స‌బ్బిడీ ప‌థ‌కం కింద రూ.175.81 కోట్లు , కాలేజీ, యూనివ‌ర్శిటీ విద్యార్ధులకు కేంద్ర రంగ స్కాల‌ర్ షిప్ ప‌థ‌కం కింద రూ.38.19 కోట్లు నిధులు విడుద‌ల చేసిన‌ట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ వెల్లడించారు. 

  పి.ఎమ్.-యు.ఎస్.పి యోజ‌న కింద గత ఐదేళ్లలో ఎపి కి మంజూరు చేసిన విడుదల చేసిన నిధుల వివ‌రాలు, గ‌త ఐదేళ్ల‌లో ఈ ప‌థ‌కం కింద న‌మోదైన విద్యార్ధుల సంఖ్య‌, ఎపిలో ల‌బ్ధి పొందిన విద్యార్ధుల సంఖ్య, ఈ ప‌థ‌కం కింద గ‌త ఐదేళ్ల‌లో ఎపిలో జిల్లాల వారీగా ప్ర‌యోజ‌నం పొందిన విద్యార్ధుల సంఖ్య వివ‌రాలు తెలియ‌ప‌ర్చాలంటూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా శాఖ ను లోక్ స‌భ‌లో సోమ‌వారం అడ‌గ‌టం జ‌రిగింది. వీటికి కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందారి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అమ‌లు చేస్తున్న ఈ పి.ఎమ్.-యు.ఎస్.పి యోజ‌న ప‌థ‌కంలో మూడు అంశాలు వున్నాయి.. 1.కళాశాల , విశ్వవిద్యాలయ విద్యార్థులకు కేంద్ర రంగ స్కాలర్‌షిప్ పథకం 2.జమ్మూ & కాశ్మీర్ ,లడఖ్ కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకం 3.విద్యా రుణం కోసం కేంద్ర రంగ వడ్డీ సబ్సిడీ పథకం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకం. లబ్ధిదారులకు ఈ ప్రయోజనాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో అందజేస్తున్న‌ట్లు వివ‌రించారు.

ఎపిలో గ‌త ఐదేళ్ల‌లో కళాశాల , విశ్వవిద్యాలయ విద్యార్థులకు కేంద్ర రంగ స్కాలర్‌షిప్ పథకం ద్వారా 32,097 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ లు పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. . 2019-20 లో 12,616 మంది విద్యార్ధులకు ఇవ్వ‌గా, 2024-25 ఏడాది కి గాను 1167 మంది విద్యార్ధులకు స్కాలర్‌షిప్ లు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఇక ఎపిలో ఈప‌థ‌కం లోని కేంద్ర రంగ వడ్డీ సబ్సిడీ పథకం ద్వారా వివిధ జిల్లాలలోని వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింద‌ని.... ముఖ్యంగా అనంతపురం, గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారని తెలిపారు. ఈ ప‌థ‌కం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అండ‌గా నిలిచింద‌ని చెప్పారు.